Wednesday, August 27, 2008

"ప్రజా రాజ్యం" సుసాద్యమా..?


ప్రజా రాజ్యం.. భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుంచి నాయకుల నోట వెలువడుతున్న ఓ రాజకీయ నాటక ప్రక్రియే ఇది. ప్రజల చేతికే పాలనన్న ప్రజారాజ్యం నిజంగానే సిద్దిస్తుందా..? అనేది మహా సంకల్పం.. మహా యుద్దం అంటూ చిరంజీవి ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్బావం అనంతరం ప్రజలకు మరో సారి వచ్చిన ఆలోచన. మరో సారి ఎందుకన్నానంటే చిరు అంటున్నా ఈ ప్రజారాజ్యం ప్రజలకు చేరువవటం సుసాద్యమా..? అన్న ప్రశ్న సంవత్సరాల తరబడి వారిలో మెదులుతున్న కల కాబట్టి. కలలు కనటం రాష్ట్ర కాదు దేశ అట్టడుగు బలహీన, బడుగు వర్గాల ప్రజానికానికి స్వాతంత్ర్యం నుంచి వచ్చిన హక్కు కాబట్టే కొత్త నాయకులు, కొత్త పార్టీలు వచ్చిన ప్రతిసారి తమకేదో పండగ వచ్చిందన్న సంతోషంలో మునిగి తేలుతుంటారు. అయితే కాలాలు యుగాలు మారినా ప్రజారాజ్యం సిద్దించే అవకాశాలు, మార్గాలు సుసాద్యమనే దోరణే ఉంది.

రాజకీయాలను, నాయకులను, వ్యవస్థను మార్చి తెలుగు వారి అత్మ గౌరవాన్ని కాపాడుతానంటూ కాసులు కురిపించే గ్లామర్ ప్రపంచం నుంచి తెలుగుదేశాధినేతగా అవిర్భవించిన ఎన్ టీఆర్ నిజంగానే అవతారపురుషుడని అంగీకరించాల్సిందే. ప్రజలే దేవుళ్లు అంటూ ఆయన చేసిన ప్రజారాజ్యాభిలాష సామాన్య, అట్టడుగు ప్రజానికానికి చేరేలోగా అవంతరాలు ఏర్పడి ప్రజలు తిరిగి తమ పూర్వ స్థితికే చేరారు. ఎన్ టీఆర్ కు ముందు ఏళ్ళ తరబడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజారాజ్యాన్ని ప్రజలకు కట్టబెట్టడం కలగానే ఉంటుందన్నది వాస్తవం. నాడు ఎలా ఉన్నా నేడు రాష్ట్రాన్ని ఏలే పాలకులు ప్రజలకు కనీసం వారి హక్కులను ఇవ్వటం కల గానే మిగులుతుందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపధ్యంలో మరో మారు చిరంజీవి ప్రజా రాజ్యాన్ని ప్రకటించటం అట్టడుగు వర్గాల వారు తిరిగి తమ కల గుర్తుకు వచ్చింది.

నిజంగా తమకేం కావాలో నిర్ణయించుకుని దానిని పొందాలనుకునే లోగానే మారే ప్రభుత్వాలతో ఏళ్ళ తరబడి సతమతమయ్యే అట్టడు వర్గాలు వాస్తవానికి కోరుకునే ప్రజారాజ్యం ఏమిటి?. కూడు...గూడు...గుడ్డ... ఇవే కదా. ఏ ప్రభుత్వం నుంచైన వారు కోరుకునేది అదే కదా. ఇవి అందించటమే ప్రజా రాజ్యమని భావించే పేదరికానికి వారినుంచి అధికారాన్ని పొందే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందన్నది జగమెరిగిన మిలియన్ డాలర్ల ప్రశ్న. అధికారం, హోదా, సంపాదన, వారసత్వ రాజకీయం వెరసి లంచగొండితనానికి అలవడిన నేటి రాజకీయాలకు పేదల ఆకలి కేకలు వినిపించక పోవటం ఏళ్ల తరబడి వస్తున్న ఆచారమే. నేటి రాజకీయాల్లో వీటిని మార్చటం సాధ్యమా..?. కష్టసాధ్యం అని నొక్కి వక్కానించొచ్చు.

ఓ నాయుడు గారు.. రెడ్డి గారు.. చౌదరి గారు.., తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్సు పార్టీ.. తెలంగానా పార్టీ.. బీజేపీ పార్టీ.. అని కులాలు, వర్గాలు, ప్రాంతీయ బేదాలపైనే ఓ సినిమాలో సీనియర్ రచయిత రాసినట్లు ఏ నాయకుడు, ఏ పార్టీకి పేదల కష్టాలపై నిబద్దత లేనప్పుడు ప్రజారాజ్యం సిద్దించటం సుసాధ్యం. మరెలా సాధ్యమవుతుందంటే.. యుద్దం జరగాలి. ఎన్ టీఆర్ పలికిన తెలుగు ఆత్మ గౌరవ పోరాటం మరో మారు వెల్లువెత్తాలి. ధైర్యం, నిజాయితీ, నిబద్దతతో కూడిన ఆత్మ విశ్వాసంతో ప్రతి వ్యక్తి తన వంతు అడుగును ముందుకెయ్యాలి. నిశ్వార్థ సేవాభావంతో చేయిచేయి కలిపి ముందుకు వెళ్లే సైనికులు మరో మారు వెలుగు చూడాలి. అప్పుడే పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేని ప్రజారాజ్యం వెల్లివిరిసే అవకాశం ఉంది.

నేను సైతం అంటూ మరో నాయకుడిగా చిరంజీవి తెరపైకి వచ్చారు. నేను సైనికుడినే అన్నారు. అంకితభావంతో అందరం కలిసికట్టుగా మనకున్న హక్కులను పొరాడి సాదిద్దాం అన్నారు. ప్రజారాజ్యం ప్రజల చేతుల్లోనే అంటున్నారు. నిజంగానే... యుద్దానికి సిద్దమవుతున్న ఈ సైనికిడిని అభినందించాల్సిందే. అందుకు ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమా అంటూ ప్రాంతీయ వాదలను, మాదిగ, మాల, బీసీ, ధనిక వర్గాలు అనే అవసరాన్ని తమకు అనుకూలంగా మారుకునే నేటి కుల వైషమ్యాల రాజకీయాలకు భిన్నంగా ప్రజల చేతికే ప్రజారాజ్యాన్ని చేరువచేసేంత వరకు జన సింధువులోని చిరు బింధువు అంకితమవుదాం. అప్పుడే తెలుగు జాతి ఆత్మ గౌరవంతో పాటు ప్రజల చేతిలోనే తమ సమున్నత భవిత సుసాధ్యమవుతుంది. చెప్పే మాట కన్న చేసే మనస్సే ఆయుధంగా మనం కూడా ప్రజల చేతికే ప్రజా రాజ్యాన్ని అందించేందుకు కృషిచేద్దాం. అప్పుడు ప్రజారాజ్యం సుసాధ్యమే..!!

రచన : మేఘన గుండ్ల