Saturday, August 23, 2008

చిరంజీవి (మరో 'తారా'జకీయం)

సినిమా వ్యక్తులు రాజకీయాలను ఏలటం ఆంద్రదేశానికి కొత్తేమీ కాదు. కానీ సముద్రంలో అలలుగా ఒక్కొసారి ఉవెత్తున ఎగిసి పడుతూ, తిరిగి వెనక్కి వెళుతూ తారాగనం రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కోవటమే గత పదేళ్ళుగా రుచించని విషయం. పక్కనే ఉన్న తమిళనాడును ఏలిన ఎంజీఆర్ నుండి మన రాష్ట్రాన్ని పాలించిన ఎన్ టీఆర్ వరకు రాజకీయల్లో తిరుగులేని నేతలుగా చెలామని అయ్యారు. వారి తర్వాత సినీ రచయుత కరుణానిధి, అనాటి తార జయలలితలు తమిళనాట ఇంకా తమ రాజకీయన్ని ఏలుతూనే ఉండగా తెలుగునాట మాత్రం తారలు బోల్తా పడ్డారు. కారణం. రాజకీయాల్లోకి వచ్చిన తారలు తమ వైఖరిని ప్రజలకు స్పష్టంగా చెప్పలేక పోవటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో 25 సంవత్సరాల నట జీవితాన్ని చవిచూసి, తెలుగునాట మెగా స్టార్ గా అశేష అభిమానుల అదరాభి మానాలు పొదుతున్న చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండటం మరోమారు తారల రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ తారల రాజకీయాలపై ఓ కధనం...

కొత్తశకం...

రాజకీయాలు సినీ తారల జీవితాలకు షరా మాములైనా తెలుగునాట రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన ఘనత దివంగత ఎన్ టీఆర్ కే దక్కింది. ఆయన ద్వారానే ఆంద్ర రాష్టంలో సినీ తారల రాజకీయ రంగ ప్రవేశాలకు పెద్దపీట వేసింది. ఎన్ టీఆర్ కు ముందు 1967లోనే నటుడు కొంగర జగ్గయ్య కాంగ్రెస్ నుంచి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉంది. అంతే కాకుండా ఆత్రేయ, జి.వరలక్ష్మి, మిక్కిలినేని, తాఫీ దర్మారావు వంటి వారు కమ్యునిష్టు పార్టీకి ప్రచారం చేశారు. ఇక రాజకీయాల్లో రక్తకన్నీరుతో గుర్తింపు పొందిన నాగభూషణం ఏకంగా మంచి ఉపన్యాసకుడిగా గుర్తింపు పొందారు. వీరంతా రాజకీయాలకు సుపరిచితమే అయినా ఒక్కసారిగా తెలుగు రాజకీయాలను మలుపుతిప్పే ప్రక్షాళణ చేసింది ఎన్ టీ ఆరే. తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో ఎన్ టీఆర్ 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించటం తో ఓ కొత్త రాజకీయ శకం ఆంద్రదేశంలో మొదలైంది.

ఎందరో...

ఎన్ టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తారలెందరో ఉన్నారు. జమున, కృష్ణ, కృష్ణమ్రాజు, మోహన్ బాబు, శారద, సత్యనారాయణ, రామానాయుడు, సుబ్బిరామిరెడ్డి, హరికృష్ణ, కోట శ్రీనివాసరావు, జయప్రద, బాబుమోహన్, అశ్వనిదత్, మురళీమోహన్, ఏవీఎస్, దర్మవరపు సుబ్రమణ్యం, రోజా ఇలా గ్లామర్ నేతల జాబితా పెరుగుతూ పోయింది. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగా ఏ పదవీ దక్కక వెనక్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు.

దక్షిణాధిన...

తమిళనాట తెర రాజకీయాలు మనకంటే ముందే మొదలయ్యాయి. అక్కడ కాంగ్రేసేతర ముఖ్యమంత్రులంతా సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. ద్రావిడ ముక్యమంత్రి అన్నదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, జానకి రామచంద్రన్, శివజీ, రజినికాంత్, శరత్ కుమార్, విజయ్ కాంత్, మనోరమ, ఎసెస్ చంద్రన్ ఇలా తెర నుంచి వచ్చిన వారి సంఖ్య చాంతాడంత ఉంటుంది. కర్నాటకలో అంబరీష్ మంత్రి పదవినే చేపట్టగా, చంద్రు, అనంతనాగ్, సాయికుమార్, జయంతి తదితరులున్నారు. అయితే కేరళలో సినిమా రాజకీయాల చుట్టరికం మనంతగా బలపడలేదని చెప్పుకోవచ్చు. ఇక మన విషయానికి వస్తే నవ్వు, తలకట్టు, మీసకట్టు, వేషం, రోషం, తనదైన గంభీర కంఠస్వరంతో తెలుగు వారిచే జేజేలు అందుకుంది ఎన్ టీఆర్ ఒక్కరే. వెండితెరపై వెలుగొందుతూనే రాజకీలను మార్చాలనే తలంపుతో అన్ని వదులుకొని జనం మద్యకు వచ్చిన ఆయనకు పట్టం కట్టారు.

సినీ దేవుళ్ళు...

తమ అభిమాన తారలకు గుళ్ళు, హారతులు ఇచ్చే భారతీయ సమాజంలో ప్రేక్షకులకు తారలు నిజంగానే ఓ మోస్తారు దేవుళ్ళు. తార దర్శన భాగ్యమో, కరచాలనమో దొరికితేనే తమ జన్మ దన్యమనుకునే జనం సెంట్ మెంట్ నే పార్టీలు అవకాశవాదంగా వాడుకుంటూ వస్తున్నాయి. సినీ తారలొస్తే జనం ఎగబడతారనే ఆలోచనతోనే సినిమా వాళ్ళు పార్టీల్లో చేరి పదవులు చేపట్టున ఆయా పార్టీల సీనియర్లు సైతం మౌనంగా ఉంటారు. ప్రతి పార్టీలోను జనాకర్షణ కలిగిన నేతలు ఒకరొ ఇద్దరో ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో వారు అన్ని ప్రాంతాలకు వెళ్ళటం కుదరదు. అందుకే జనం నొట్లో నానే సినీ గ్లామర్ ను తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవడం నేడు సర్వ సాదరనంగా మారింది.

రంగప్రవేశం...

"గ్లామర్ ఒక్కటే ప్రజల అవసరాలను తీర్చలేదు. అదొక్కటే చూసి ప్రజలు మద్దతివ్వరు. కావలసింది చిత్తశుద్ది, నిజాయితీ" అని ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సందర్బంలో ఎన్ టీఆర్ అన్నారు. అలా ప్రజలకు చిత్తశుద్దితో దగ్గరైతేనే తిరిగి వారిని గెలిపిస్తారన్నది తారల రాజకీయ జీవితాల్లో వాస్తవాన్ని చూపింది. రాజకీయాల్లోకి వచ్చిన తారల్లో అన్ని రకాల వాళ్ళున్నారు. కొదరు డబ్బు కోసమైతే, పదవుల కోసం, పాత చిక్కులను తప్పించుకోవటం కోసం, కొత్త పరిచయాల కోసం అవసరాన్ని బట్టి మరికొందరు ఉన్నారు. వీరే కాకుండా ఏదో తపన, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వ్యవస్థను మార్చాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన వారున్నారు. అయితే వీరు రాజకీయ వ్యవస్థను మార్చటంలో అశక్తులమని తెలుసుకుని అక్కడ ఇమడలేక గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చేస్తారు. ఈ జబితాలో దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి వారున్నారు.

చిత్తశుద్ది.. నిజాయితి...

"ఈ ప్రజాభిమానం దేవుడిచ్చిన వరం"అని ఎన్ టీఆర్ వందలసార్లు అనుంటారు. నిజమే ఆ గ్లామర్, ఆకర్శణ ఒక వరమే. రాజకీయ నాయకులు పాతికేళ్ళ ప్రజ జీవితంలో సాధించలేనిదాన్ని పాతికేళ్ళ హీరో అవలీలగా సొంతం చేసుకోగలడు. రంగుల లోకంలోనికి తీసుకెళ్ళే తారలంటే సామాన్యులకు ఎక్కడలేని అభిమానం. వారికి దూరంగా ఉన్నా మనవాడు అనే ఆత్మీయ భావన. ఆ అభిమానం కలకాలం తమ వెంట ఉండాలంటే అందరికి సాద్యం కాకపోవచ్చు. కాని ఎన్ టీఆర్ అన్నట్లు చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే ప్రజాభిమానం ఎల్లప్పుడు వారి వెంటే. ఎన్ టీఆర్, ఎంజీఆర్ వంటి వారికి సాద్యమైంది. చరిత్రలో లిఖించబడింది. ఇప్పుడు చిరంజీవి రాజకీయ ప్రవేశం. సాద్యమైతే చరిత్ర పునరావృతమే ?.

సేకరణ : మేఘన గుండ్ల