Friday, August 22, 2008

పుడమి తల్లీ... నీకు వందనాలమ్మా...





నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా!
నేలమ్మ నేలమ్మ నేలమ్మా!


సాలేటి వానకే తుళ్లింత
ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత

నీళ్లనే చనుబాలుగా
గాలినే ఉయ్యాలగా
పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల
నీవు సక్కంగ మోసేవు మొక్కల్ల
పరువమొచ్చి చేను వంగే
పైరు కాపు మేను పొంగే
పంట బిడ్డల రైతు బండి కెత్తినంక
పగిలి పోతుందమ్మ నీ కన్న కడుపింక
నేలమ్మ నేలమ్మ నేలమ్మా

తల్లి నువు నవ్వితే మాగాణి
యెద తలుపు తీసావంటే సింగరేణి
తనువునే తవ్వి తీసినా
మనుసునే తొలిచేసినా
పొట్ట తిప్పలకు బిడ్డలు
నీ పొట్టలో పడుతున్న తిప్పలు
ఏరోజు కారోజు తీరీ
నూరేళ్ల ఆయుష్షు కోరీ
కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టు నేలమ్మా

నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా!
నేలమ్మ నేలమ్మ నేలమ్మా!

తైలాలు పూసింది నైలు నది
నీకు తలస్నానమయ్యింది గంగానది
గంధమే పూసిందహో
పొందుగా హోయంగ్ హో
ఖండాలలో రంగు రంగు పూలు
గండు కోయిలలు నైటింగేల్లు
కొలువయినదా వెండి కొండ
నీ జాలి గుండెల జెండా
కొలువయినదా వెండి కొండ
నీ జాలి గుండెల జెండా
ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కన్నుల గనలేక కంపించిపోతావే నేలమ్మా

ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కన్నుల గనలేక కంపించిపోతావే నేలమ్మా

మా తల్లి నీ మట్టి బంగారం
అది మానవాళి నుదుట సింధూరం
అమ్మ నీ అనురాగమూ
కమ్మనీ సమభాగము
గొప్పలు తప్పులు చూడక
నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినా రారాజులై
పేరొందినా నిరుపేదలై
నీ ఒంటిపై సుతుల చితులు గాల్చుకున్న
నీ వంటి తల్లింక దేవుళ్లకే లేదు నేలమ్మా
నీ ఒంటిపై సుతుల చితులు గాల్చుకున్న
నీ వంటి తల్లింక దేవుళ్లకే లేదు నేలమ్మా

నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా!
నేలమ్మ నేలమ్మ నేలమ్మా

రచన : సుద్దాల అశోక్ తేజ
సేకరణ : మేఘన గుండ్ల